29, సెప్టెంబర్ 2010, బుధవారం

వయా కొత్తగూడెం


ఇక్కడోసారి దిగకూడదూ
ఒక కొత్త లోకాన్ని పలకరించోచ్చూ
మనిషి తనను తానుపొరలు పొరలుగా తవ్వుకుంటూ
ఒకానొక మహా శూన్యాన్ని ఆవిష్కరించే
అరుదైన దృశ్యాన్ని చూసి పోవచ్చూ

కేవలం బతకటం కోసం
ప్రతి రోజూ సమాధి ప్రవేసాలు చేస్తూ
ప్రతి నిత్యం ఒక కొత్త జన్మ ఎత్తుతూ
మనిషి తన మాంసాన్ని లారీలకూ ,గూడ్సు బోగీలకూ ఎత్తి
పారిశ్రామిక సింహాలకు సరఫరా చేసే
ఒక విచిత్ర సత్యాన్ని అనుభవించ వచ్చూ

ఎలాగూ వచ్చిన వాళ్ళు వచ్చారు
కాసేపు ఇక్కడ నిలబడ కూడదూ
ఆకలి తట్టలో అడవిని మోసుకొచ్చి
పట్టణాల విస్తర్లలో అన్నమయ్యే బంజారా బెహేన్ల ఒంటి మీద
పగిలి పోయిన సూర్యుడి ముక్కల్లో
మీ బీట్ట వారిన ముఖాలు చూసుకోవచ్చూ

అలసి పోయిన సింగరేణి ఓపన్ కాస్ప్ గొంతులోకి
బ్రాందీ చుక్కలుగా ఒలుకుతున్న గని కార్మికుల్ని ముట్టుకుని
సూర్య మండల స్పర్శని అనుభవించ వచ్చు రండి
ప్రజా స్వామ్యం ఉచ్చులు పరుచుకు కూచున్న
వ్యాపారం పులి వల్లించే కమ్యునిస్ట్ సూక్తులు విందూరు కానీ

జీతాన్నంత చక్ర వడ్డీ గద్ద తన్నుకు పోతే
ఖాళీ మందు సీసాలయి ఒట్టి పోయిన సంసారాల్ని చూద్దురు గానీ
అలిసి పోయి వచ్చారు
ఆ బేరియం కంపెనీ విడిచే విష వాయువు నాఘ్రానించండి
భూమధ్య రేఖా ప్రాంతపు వెచ్చదనాన్ని ఫీలవ్వండి

సింగరేణి చవక దుకాణంలో
నరాలుబ్బుకోచ్చిన అకాల వృద్ధాప్యాన్ని
అతి చవగ్గా కొనుక్కుని మీ ఇళ్ళలో అలంకరించుకోండి
కలగలుపు నాగరికతలోంచి అసంబద్దంగా రూపెత్తుకున్న
ఒక బానిస సంస్కృతిని ఇక్కడ గమనించండి

మళ్ళీ -వస్తారో రారో
ఒక్కసారా బొగ్గు బావిలోకి దిగి చూడ కూడదూ
ఒక శాశ్వత సూర్య గ్రహణ అనుభవాన్ని చవిచూడవచ్చు
అభద్రతా పెళుసు కిందపడి అల్లలాడే
లేత పుస్తెల గుండె కోతల సంగీతాన్ని విని పోవచ్చు

రైళ్ళూ ,పరిశ్రమలూ ,ఈ దేశమూ బొగ్గుతో కాదు
గని కార్మికుల నెత్తురుతో నడుస్తున్నాయన్న నిజాన్ని తెలుసుకోవచ్చు

ఎలాగూ ఇక్కడిదాకా వచ్చారు కదా
ఈ ఉద్యమం వాకిట్లోకి అడుగుపెట్టకూడదూ
మృత వీరులకో దణ్ణం పెట్టి ఈ నెత్తుటి ముర్రేడులో మునిగి పునీతులవ్వోచ్చూ
ఒక్కసారీ కొత్తగూడెంలో దిగకూడదూ
జీవితంలో ఒక్కపారైనా
బతికిన క్షణాలు అనుభవించిపోవచ్చూ .....మద్దూరి నగేష్ బాబు